Wednesday, December 26, 2007

సొంత పేరుతో రాయాలా ?


వివిధ బ్లాగులపైన మన అభిప్రాయాలను రాయడం మన
సొంత పేరుతో రాయాలా లేదా ఏ మారు
పేరుతోనైనా
రాయవచ్చునా?
నిజానికి మారు పేరుతో రచనలు చేయడం, సొంత పేరుతో రచనలు
చేయడం ఒకప్పుడు పెద్ద చర్చనీయాంశం. మరి ఉత్తరాలు రాసేవారి సంగతి? విషయం
ముఖ్యమా? వ్యక్తి ముఖ్యమా? కొ.కు, రావిశాస్త్రి తదితరులు మారుపేర్లతో రచనలు
చేసిన సంగతి తెలిసిందే. వివేకనందుడు దేశమంతా నాలుగైదు సార్లు రకరకాల పేర్లతో
తిరిగేవారు. చికాగో వెళ్లేముందర క్షేత్రి మహరాజు వివేకానంద పేరు ఖాయం చేసిన
సంగతి మీ అందరికీ తెలిసిందే. చెప్పండి. పేరు ముఖ్యమా? బ్లాగులకు ఏదో విధంగా
స్పందించడం అనే అలవాటు పెంపొందిచడం ముఖ్యమా?
- దుప్పల రవికుమార్


http://sameekshaclub.wordpress.com

Monday, December 24, 2007

అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు




అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

Sunday, December 23, 2007

బ్లాగుల బాగోగులు.....5


ఆంగ్ల వెబ్ సైట్లు ఆహ్వానించిందే తడవుగా పోలో మని చాలా మంది బ్లాగర్లు తమ బ్లాగులను వారికి అనుబంధించటంతో వెబ్ సైట్లకు బహుళప్రయోజన కారణమయ్యింది.అదే సమయంలో విడేశీ బ్లాగర్లు తమతడాఖా ఏమిటో అక్కడి వ్యవస్థకు రుచి చూయించి సిటిజెన్ జర్నలిజం అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి,పత్రికలు,కొంతమేరకు ఎలక్ట్రానిక్ మీడియా వినియోగదారుల అబిరుచులకు అనుగుణంగా కనీసం వందో వంతైనా తమ అజెండాలను మార్చే వీలు కల్పించారు.ఇక్కడ మనదేశంలో ఫలానా బ్లాగు ఫలానా పోర్టల్లో ఉంటుందీ అనే అభిప్రాయానికి ఆంగ్లపాఠకులు వచ్చేసారు.అంటే నా ఉద్దేశ్యం ఇంగ్లీషు బ్లాగు ఆగ్రిగేటర్ల పాత్ర చాలా పరిమితమయ్యిందని.కొన్ని పోర్టల్స్ లో బ్లాగుల పక్కన వస్తున్న ప్రకటనల మీది ఆదాయంకూడా ఆటోమాటిగ్గా వాళ్ళకే చెందుతోంది.బ్లాగుల మీద ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచుకోవటంలో వివిధదేశాల్లో వివిధపద్ధతులు అమల్లో ఉన్నాయి.ఇప్పటివరకూ నాకు తెలిసి
బ్లాగర్లకు డబ్బులిస్తున్న వెబ్ సైట్ ఒక్కటీ
లేదు
,కానీ వాళ్ళు అడిగి మరీ రాయించుకుంటున్న గెస్ట్ కాలమిస్టుల జాబితాలు చూస్తుంటే ఉచితంగా రాసే మహానుభావుడు ఒక్కడూలేడు.

Saturday, December 22, 2007

బ్లాగుల బాగోగులు.....4


మహాశయులారా నిన్న మీకు మనవి చేసినట్లు గత అర్ధరాత్రి పన్నెండు గంటలకు నా ఆంగ్లబ్లాగులకు
అంత్యక్రియలు జరిపించాను ఒంటరిగా
.ఇక అసలు విషయానికి వస్తే,ఎందరో ప్రతిభావంతులయిన ఆంగ్లరచయితలూ,అధ్యాపకులు,విమర్శకులూ,మరి ముఖ్యంగా లక్షలాది విద్యార్ధులు ఉన్న మనదేశంలో బ్లాగింగు అనేది ఎందరికో ఒక అయాచితవరంలా దొరికింది. ఆంగ్లదినపత్రికలు,సాహిత్యపత్రికలూ,తమ రచనలను ప్రచురించవూ అని , గ్రహించిన సృజన శీలులంతా తమకు దొరికిన బ్లాగు మహాసౌధాన్ని తమరచనలతో సంవృద్ధి చేస్తూ,అలంకరిస్తూ,ఎన్నో దేశాలవారికన్నా, ఎంచక్కని ఇంగ్లీషులో రాస్తూ

భారతాంగ్లకేతనాన్ని, విశ్వవీధుల్లో సగర్వంగా ఎగురవేస్తున్నారు.అంతవరకూ బాగానే ఉంది కధ.ఐతేబ్లాగుల ప్రాముఖ్యం ఒకవేపు,బ్లాగుల్లో నాణ్యత పెరగటం మరోవేపు,బాగున్న వాటిల్లోనుంచి ఎత్తిపోతల పధకం కింద మనం ముద్ర గుద్దేసుకుంటే ఎవడు అడుగుతాడూ అనే తెగింపుతో కొన్ని పత్రికలూ,మరికొన్ని వెబ్ పోర్టల్సూ నిస్సిగ్గుగా,నిర్లజ్జగా,బ్లాగర్ల రచనలను తమస్వంత కంటెంటుగా ప్రచురించుకోవటం ప్రారంభించాయి.పాపం కొన్నాళ్ళు వాటి ఆటలు బాగానే సాగాయి.ఎంతగుట్టుగా చేసినా కొన్నిపనులు దాగవు.అలాగే దొంగపనులు అసలు దాగవు కదా.ఈ ఘనతవహించిన వెబ్ సైట్లు చేస్తున్న బాగోతం బయటపడటం,బ్లాగర్లందరూ ఒత్తిడి తీసుకు రావటంతో తప్పైపోయింది అనే అర్ధం వచ్చేలా వారు ఏదో ఒకమూల చిన్న సవరణలాంటిది ప్రకటించటం కూడా జరిగిపోయాయి.
దానితో మనవాళ్ళు మెయిన్ స్ట్రీం మీడియా కోరలు పీకాము,కొమ్ములు ఒంచాము అంటూ దంభాలు కొట్టుకోవటం ప్రారంభించారు.కాకపోతే ఈ హడావుడిలో మనవాళ్ళు కొన్ని ముఖ్యమైన అంశాలను కావాలనే విస్మరిస్తున్నరేమో అనే అనుమానం నాకు కలుగుతోంది.

Friday, December 21, 2007

బ్లాగుల బాగోగులు .....3


ఇంగ్లీషు బ్లాగుల సంగతంటే భారతీయుల ఆంగ్లబ్లాగులు అన్నమాట.బ్లాగు అన్నప్రక్రియ ప్రారంభం అయిన కొత్తల్లోనే మనవాళ్ళు ఆ కళను ఔపోసన పట్టి తమదైన శైలితో విజృంభణ ఆరంభించారు.ఈరోజు ఇతమిద్ధంగా ఇంతమందీ అని ఖచ్చితంగా చెప్పలేము గానీ ఆంగ్ల బ్లాగర్ల సంఖ్య వేలను దాటి లక్షల్లోకి చేరుతోంది.ఇన్స్టా బ్లాగ్ మొదటి బ్లాగు నెట్ వర్క్ కాగా కాలక్రమంలో చాలా వచ్చాయి.ఇంగ్లీషు బ్లాగర్లకు సౌలభ్యాలు ఎన్ని ఉన్నాయో,ఇబ్బందులూ అన్ని ఉన్నాయి.ప్రపంచంలోని ఏ అంశం మీదయినా రాస్తే చదివే పాఠకులు ఉండటం ఒక వరమైతే కోట్లాది ఇంగ్లీషు బ్లాగులున్న సమయంలో ఎన్ని లేబుల్స్,ట్యాగ్స్,ఎన్ని ప్రయత్నాలు చేసినా పాఠకుల ముందుకు తీసుకు వెళ్ళటం అనేది వారికో విషమపరీక్ష అవుతోంది ప్రతీ సారి.నాస్వీయానుభవం లోనే...నేను చాలా కాలం రెండు ఆంగ్లబ్లాగులను నిర్వహించాను.విశాఖపట్నం గురించి చాలా తాజా సమచారం ఎప్పటికప్పుడు మిగిలిన వెబ్ సైట్లు,పత్రికలకన్నా ముందే ఇచ్చే వాడిని.ఫొటోలు,వీలున్నప్పుడు వీడియోలు ఇలా అన్నీ చేశాను.ఎన్ని చేసినా అది సముద్రంలో కాకి....ఈక అయ్యింది తప్ప ఏమాత్రం ఫలితం లేక పోయింది.అందుకే వాటికి అంత్యక్రియలు చేయబోతున్నాను. అంటే డిలిట్ ది బ్లాగ్స్.

Thursday, December 20, 2007

బ్లాగుల బాగోగులు....2


ప్రతి రోజూ చర్చావేదికలో ఒక చర్చనీయాంశం ఉండాలని మొదట భావించాను.దానికి తగ్గట్లే పెద్దలు సిబిరావు గారు ప్రతిపాదించిన అంశం మీదే ఇంకా చర్చ జరుగుతోంది.మిగిలిన మిత్రులు ఇంకా ఏమీ ప్రతిపాదనలు పంపలేదు.బ్లాగులపఠనీయతను పెంచటం,మరింతమంది పాఠకులను ,పేరెన్నిక గన్న వారిని బ్లాగర్లుగా కూడా మార్చటం అనేవి ప్రాధాన్యతాంశాలే అయినా
ప్రస్తుతం ఉన్న చదువరుల చేత వారి స్పందనను రాబట్టటంలో వస్తున్న నిర్లిప్త ధోరణి పట్ల కలవరపడుతున్నామని దాదాపు అందరూ అంటున్నారు.తెలుగులో బ్లాగుల సంఖ్య పెరగటం వల్ల చదవటం ఎక్కువయి,రాసేది తగ్గుతోందని మరి కొందరు అంటున్నారు.బ్లాగుల సంఖ్య పెరగటం ఆహ్వానించదగ్గ పరిణామమే.అలాగే ఒక్కో బ్లాగరు 9,10 బ్లాగులను నిర్వహించటం కూడా మనం చూస్తున్నాము.

ముందు ఒక విభాగానికి తమ రచనలను పరిమితం చేసుకుని తర్వాత మిగిలినవి ఎవరో రాస్తున్నారు,మనం రాయలేకపోతున్నామని అలోచిస్తూ కూడా ఇంకో బ్లాగు మొదలెట్టకుండా సర్దుకుపోతున్నవారూ ఉన్నారు.సృజనాత్మకతతో మిళితమైఉన్న ఏ రంగంలోని వారికయినా పాఠకుల/ప్రేక్షకుల/శ్రోతల స్పందన తెలుసుకోవాలనే భావన ఉండటం ఎంతో సహజం.మిగిలిన సాధనాలతో పోలిస్తే బ్లాగుల్లో తక్షణస్పందన ఎంతో సులభం,స్వల్పఖర్చు,కాలం సరిపోతాయి.అయితే బాగా విశ్లేష్ణాత్మకంగా రాయాలంటే దేనికయినా ఎక్కువ సమయం కావాల్సిందే అనేది నిర్వివాదాంశం.కానీ రకరకాల కారణాలతో ఆ స్పందన కరువౌతోంది.
తాను రాసిన రచన మీద పాఠకులు ఏమనుకుంటున్నారో అని రచయిత భావిస్తుండగా ఆ ఏమి రాద్దంలే కామెంటు అని పాఠకులు అనుకుంటూ పోతే ఇక దానికి అంతమెక్కడ? ప్రస్తుతానికి దాదాపు పాఠకులందరూ బ్లాగర్లే,బ్లాగ్లోకంలోకి ప్రవేశం కోసం ఒక బ్లాగునారంభించి ఇక అక్కడుంచి కేవలం వ్యాఖ్యానాలకే పరిమితమై పోతున్నవారినీ మనం చూస్తున్నాం.నాకు లాగా ఏదిపడితే అది రాయటం కాకుండా ఎంపిక చేసుకున్న అంశాల మీద రాయటం, రాయగలటం,ఒక కళ,తమ రచనల కోసం జనాన్ని ఎదురు చూసేలా చెయగలగటం మరో మహత్తర కళ.కానీ ఎందుచేతనో ఆ కళాకారులు పెద్దసంఖ్యలో దర్శనమివ్వట్లేదు.
కాసేపు ఆంగ్ల బ్లాగుల్లోకి వెళితే .....

Monday, December 17, 2007

బ్లాగుల బాగోగులు


తెలుగు బ్లాగర్ల సంఖ్య తో పాటు వాసి కూడా పెరుగుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. అమెరికా బ్లాగర్లతో పోలిస్తే మన దేశంలో ముఖ్యంగా తెలుగులో బ్లాగురచన అనేది కొంచెం వెనుక ప్రారంభమయినా ఈరోజు గణనీయమైన సంఖ్యలో తెలుగు బ్లాగులు వెలువడుతున్నాయి.కూడలి,జల్లెడ,తేనెగూడు,తెలుగుబ్లాగర్స్ డాట్ కాం వంటివారి సేవ ఎంత చెప్పినా ఈవిషయంలో తీర్చుకోలేనిది.బ్రిటానికా, ఎన్ కార్టా వంటి వాటికి ధీటుగా ప్రత్యామ్నయ విజ్ఞాన సర్వసం గా దినదినాభివృద్ధి చెందుతున్న వికిపీడియా లో తెలుగు వారి వంతు ప్రశంసనీయంగా పెరిగిందంటే బ్లాగరుల సహాయ సహకారాలే ప్రధాన కారణం.



గతంలో ఏకొద్దిమందికో పరిమితమైపోయిన బ్లాగులు క్రమక్రమగా జనాభాలో ఎక్కువ మందికి అందుబాటులోకి రావటానికి సాంకేతిక కారణాలతోపాటు సాంస్కృతిక అంశాలూ దోహదం చేస్తున్నాయి.ఎందరో ప్రతిభావంతమైన రచనలను తమ బ్లాగుల ద్వారా మనకు అందిస్తున్నారు.ఎంతో మంది మట్టిలో మాణిక్యాల లాంటి సృజన శీ లులు బ్లాగులలోకంలో తమపాదముద్రలను ప్రతిష్ఠిస్తున్నారు. అదీఇదీ అని పరిమితులు లేకుండా దాదాపుగా సమకాలీన సమాజంలోని అన్ని విషయాలమీద తమ అభిప్రాయాలను స్పష్టంగా,తమదైన శైలిలో వ్యక్తీకరిస్తున్నారు.



పాఠకులు ఇచ్చే సూచనల మేరకు ఎప్పటికప్పుడు తమ భాష,రచనా సంవిధానంలో మార్పులు చేసుకుంటూ మరిన్ని మెరుగులు దిద్దుతున్నారు.కళలు,సాహిత్యం,సినిమా.హాస్యం,కవిత్వం,సాహితీ విమర్శ, రాజకీయాలు,సాంకేతిక రంగం ఇలా ప్రతి అంశాలోనూ నిష్ణాతులైన రచయితలు బ్లాగర్లలో ఉన్నారు. అయితే ఇక్కద కొన్ని కీలకాంశాలను కూడా ప్రస్తావించుకోవాలి.లబ్ధ ప్రతిష్తులైన ఎందరో ఏ కారణాల చేతనో తెలియదు కాని బ్లాగుల రచనలకు దూరంగా ఉంటున్నారు.కొందరికి తమ రచన మీద బ్లాగుల్లో ఎంతో రసవత్తరమైన చర్చ జరిగిన విషయం కూడా తెలియట్లేదు .అది వారి తప్పు అని మనం అనలేము.వారిని క్రమక్రంగా బ్లాగురచనలకు ప్రోత్సాహించాలి.ఒక మిత్రుడు అన్నట్లు ఆర్ధిక కారాణాలు కూడా ఇందులో అంతర్భాగం కావచ్చేమో కానీ అదే అసలు కీలకం అని నేను భావించటం లేదు.సందర్భం వచ్చింది కాబట్టి,బ్లాగు రచనల ద్వారా ఏమయినా రాబడి ఉంటుందేమో కనీసం భవిష్యత్తులో యాడ్ సెన్స్ కాకుండా పెద్దలు ఆలోచించాలి.ఈ యాడ్ సెన్స్ మతలబు ఏమిటో ఇంతవరకూ నాకు అంతుబట్టలేదు,బహుశా నాలాంటి వారు ఇంకెందురున్నారో.



బ్లాగర్లలో ఎక్కువ మందిని కలవరపెడుతున్న అంశం మరింత పాఠకాదరణ పొందటం.దాదాపు అన్ని బ్లాగులకూ పాఠకులున్నారు,ఉంటారు కూడా. కానీ బ్లాగరు తాను ఎంతో శ్రమకోర్చి రాసినప్పుడు పఠితల స్పందనను ఆశించటంలో తప్పు లేదు.కానీ ఇక్కడ అదే కొరవడుతోంది చాలా మంది విషయంలో. అన్ని బ్లాగులూ చదివి అందర్నీ వ్యాఖ్యానాలు చేయమని అనలేము గాని,నచ్చితే ఒకముక్క,నచ్చక పోతే రెండు ముక్కలు రాసేందుకు అవకాశముంది.కామెంట్లు రాయటంవల్ల ఒక రచన మీద మన అంచనా రచయితకు తెలియ జేయొచ్చు అలాగే మనలోని చోటా సాహితీ విమర్శకుడికి ఒక దారీ చూయించొచ్చు.
బ్లాగును ఎక్కువ మంది పాఠకుల వద్దకు తీసుకు వెళ్ళటం అనేది మరో అంశం. ఎవరికి వారు బ్లాగు రాసుకున్నా ఒక యాగ్రిగేటరు సాయం లేనిదే ఆ బ్లాగ్ వెలుగు చూసే అవకాశాలు తక్కువ కాబట్టి ముందా యాగ్రిగేటరును ప్రజబాహుళ్యంలో ప్రచారం చేయాలి.తద్వారా స్వామికార్యం స్వకార్యం రెండూ నెరవేరే అవకాశం ఉంది.



అదే విధంగా వీలయినన్ని డైరెక్టరీలలో మన బ్లాగును సబ్మిట్ చేయటంవల్ల కూడా కొంతమేరకు ఫలితాలు ఆశాజనకంగా ఉండొచ్చు.దాని వల్ల తెలుగు బ్లాగులుతో పాటు మనమూ విదేశీజనాల కళ్ళల్లొ పడే అవకాశం ఉంది. నేను తెలుగులో బ్లాగు ప్రారంభించిన కొత్తలో టెక్నొరటిలో నార్యాంకు నలభై నాలుగు లక్షల చిల్లర కొద్ది రోజుల తర్వాత ఇరవై లక్షల చిల్లర అంటే సుమారు 30లక్షలకు దగ్గరలో స్థిరంగా ఉండి పోయింది.అదేవిధంగా సులేఖా లో కూడా ప్రయత్నించొచ్చు.

ఇంకా ఉంది....

Thursday, December 6, 2007

ఔనేమో?కాదంటారా?







పెద్దలు,దీప్తిధార సిబిరావు గారు ---"బ్లాగులు చదివేది,కామెంట్లు రాసేది తోటి బ్లాగరులే కాని,పాఠకులు కాదు.Anonymous గా వ్యాఖ్యలు రాసేది కూడా బ్లాగరులే.Popularity కోసం వారి టపాలపై,వారే వ్యాఖ్యలు రాసేది బ్లాగరులే.బ్లాగు ప్రజలకు చేరటం లో విఫలమయ్యింది" అంటున్నారు.వారి వాదనలో నిజముందా?పాపులారిటి కోసం పాకులాడటం వల్ల బ్లాగర్లకు వచ్చే ప్రయోజనాలేమయినా ఉన్నాయా?బ్లాగు ఒక సమచార సాధనంగా ప్రజలకు చేరటంలో విఫలమయ్యిందనే రావు గారి మాటల్లో నిజమెంత?మన దేశాని సంబంధించి బ్లాగులవర్తమానం,భవిష్యత్తు ఎలా ఉంది,ఉండబోతుంది?తెలియచేయండి.

చర్చావేదిక


చర్చావేదికకు స్వాగతం.వృత్తివ్యాపకాల్లో క్షణం ఖాళీ లేకుండా గడిపే మీఅందరికీ,తెలుగుభాషను అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు మీరు చేస్తున్న కృషినీ అభినందిస్తూ ఈ చర్చావేదికలోకి అహ్వానిస్తున్నాను.ఎవరి బ్లాగులు వారివిగా మిగిలిపోతూ రచయితలకూ,కామెంట్లు చేసే వారికి మాత్రమే పరిమితమయి పోతున్న సమయంలో ఈ చర్చా వేదిక భిన్నాంశాలను,ప్రస్తావిస్తూ,చర్చిస్తూ,ఎక్కువమందికి అమోదయోగ్యమైన, ఆచరణకు అనుకూలమయిన పరిష్కారాలను కనుగొనే దిశగా పయనిస్తుంది.ఇక్కడ ఎవరయినా ఒక అంశాన్ని ప్రస్తావించొచ్చు,వ్యాఖ్యానించొచ్చు.కానీ వ్యక్తిగతదూషణలూ,కులమతప్రాంతీయ,భాషా వైషమ్యాలను ప్రేరేపించేవిగా ఉండకూడదు. అనానిమస్ అనే ముసుగుమనుషుల వ్యాఖ్యానాలు ఇక్కడ అనుమతించబడవు.
రండి,ప్రవహించండి జీవనదిలా,ప్రాణవాయువులా,పచ్చనిపైరు లా,నులివెచ్చని నెగడులా, అందరిపై కప్పు ఆకాశంలా....