Monday, March 24, 2008

నిందితులు ఎవరు??

మిలాదునబి,శుభశుక్రవారం(good Friday)హోలీ,రఘువరన్,శోభన్ బాబుల ఆకస్మిక మరణాలు,సాక్షి పత్రికావిష్కరణ,ఇలా ఎన్నెన్నో పర్వదినాలూ,దుర్దినాలమధ్య కూడా నామనసుని కలచివేస్తున్న సంఘటనను మీ అందరితో పంచుకుని మీ భావాలు తెలుసుకుందామని ఓ చిన్నప్రయత్నం.

లక్ష్మీ,రాంబాబు(అసలు పేర్లు కావు)ఇద్దరూ కూలీనాలీ చేసుకుని బ్రతికే కుటుంబాల వారు.విశాఖపట్నంలొ ఉన్న లక్షలాది మంది లాగానే బతుకు తెరువు కోసం ఎక్కడినుండో వచ్చిన వాళ్ళు.ఇద్దరూ భవననిర్మాణకూలీలుగా పనిచేస్తూ,ప్రేమించుకున్నారు.లక్ష్మి ఈక్రమంలో గర్భవతి అయ్యింది.ఇద్దరి కులాలూ ఒకటే కావటంతో పెద్దలు కూడా అభ్యంతరం పెట్టక పెళ్ళికి ముహూర్తాలు పెట్టించారు.

పెళ్ళికూతురు లక్ష్మికి వేవిళ్ళు,వాంతులు,వంట్లో వికారం.పందిట్లో ఈ పిల్లెక్కడ వాంతి చేసుకుని,కడుపుతో ఉన్న పిల్లకు పెళ్ళా అంటారేమోనని భయపడ్డ పెద్దలు ఆ అమ్మాయిని ఒక నాటు వైద్యుడి దగ్గర తెచ్చిన మందులు వాడి,గర్భస్రావం అయ్యేలా ప్రయత్నించారు.ఒక వైపు పెళ్ళి ఏర్పాట్లు జరుగుతున్నాయి,మరో వైపు లక్ష్మికి రక్తస్రావం అవుతోంది.మనసులో ఆనందం,శారీరకంగా భరించలేని బాధతో ఆ చిన్నారితల్లి విలవిల్లాడింది.కళ్యాణం కక్కొచ్చినా ఆగదుగా..పెళ్ళిపీటల మీద పిల్లలిద్దరూ కూర్చున్నారు.పంతులుగారు మంత్రాలు చదువుతూనే ఉన్నాడు,శతమానం భవతీ అనబోతున్నాడు,ఈ లోపు పిలుపు రానే వచ్చింది,తిరిగి రాలేని చోటు నుంచి.పసుపు బట్టలతోనే,పెళ్ళిపీటలమీదే,భరించలేని ఆ నొప్పికి తట్టుకోలేని ఆ పిచ్చితల్లి ఒక నిస్సహాయ ఆర్తనాదం చేసి,కన్ను మూసింది.
ఇంతకూ లక్ష్మి వయసు 17సంవత్సరాలు కాగా,రాంబాబుకు 19.


పెద్దలారా చెప్పండి, ఇక్కడ తప్పెవరిది,ఆ అమాయకురాలు,పదిహేడేళ్ళకే ప్రేమలో పడి,గర్భవతయ్యి,
నాటు మందులకు ప్రాణాలు కోల్పోయిన ఈ ఉదంతంలో నిందితులు ఎవరు??గత బుధవారం విశాఖపట్నం లొ జరిగిన ఒక వాస్తవ సంఘటన ఇది.మీ తీర్పు చెప్పండి.