
వాశి తో పాటు రాశి కూడా చాలా అవసరమైన సంధి దశలో తెలుగు బ్లాగులున్నాయి ఈ రోజు. తెలుగులో రాయలేకపోవటం అంటే టైపింగు, కంప్యూటరు, ఇంటర్నెట్ అందుబాటులో లేక పోవడమూ అనేవి పలురకాల కారణాలతో ముడిబడి ఉన్న అంశాలు. కొన్ని వ్యక్తిగత స్థాయిలోనివి కాగా మరికొన్ని ప్రభుత్వం చేయాల్సినవి. కానీ పైన పేర్కొన్న అంశాలేవీ మనలోని ఉత్సాహాన్ని, ఉరకలూ, పరుగుల మీద ముందుకురికే ఆలోచనలనూ, అభిప్రాయాలనూ అడ్డుకోలేవు. కేవలం రాసుకుంటూ పోయే దశ నుంచి ఈ నాటి తెలుగు బ్లాగర్లు స్వచ్చందంగా సాంకేతిక సహాయం అదీ తక్షణ సాయం సుదూరతీరాల్లో ఉన్న వారికి కూడా అందించి మాట లకందని సేవ చేస్తున్నారు. వేలు పెట్టి తెలుగు సాఫ్ట్ వేర్ కొని, కీబోర్డ్ లు మార్చుకుని, సగం వచ్చి సగం రాక ఇబ్బందులు ఎదుర్కొని మధ్యలో వదిలేసిన వారు, మళ్ళీ సులభంగా సజావుగా తెలుగు టైపింగు చేయగలుతున్నారూ అంటే మన బ్లాగర్ల సాయంతోనే. బ్లాగులు అంటే ఏమిటీ, తెలుగులో బ్లాగులు ఎలారాయాలీ అనే ప్రాధమిక అంశాలనుంచి టీంవ్యూయర్ అనే సాధనంతో ఎక్కడో ఉన్నవారి కంప్యూటర్ లోకి ప్రవేశించి విసుగువిరామంలేకుండా శ్రమించి సమస్యను పరిష్కరించేందుకు రాత్రి రెండు గంటలవరకూ కృషి చేస్తున్న వారిని, నిస్వార్ధంగా వారు అందిస్తున్న సహాయానికి ఎలా మూల్యంచెల్లించగలంఅని ఆలోచిస్తే , అసలు కృతజ్ఞత అనే మాటే ఎత్తొద్దనే నల్లమోతు శ్రీధర్, శ్రీనివాస కర, ప్రసాద్, ప్రవీణ్, ఇలా ఎందరో శ్రామికులు. వీరందరికీ సంధానకర్త జ్యోతి. జ్యోతి ప్రోత్శాహంతో బ్లాగర్లుగా మారి ఏకకాలం లో అటుబ్లాగులకు, ఇటు భాషకు, మరో వైపు సమాజసేవా కార్యక్రమాల్లో, సాంకేతిక తక్షణసహాయం లో చురుకుగా పనిచేస్తున్న వారిని చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. తాజాగా జాగృతి పేరుతో వస్తున్న బ్లాగు కూడా కంప్యూటర్ ఎరా పాఠకుడిదే కావటం యాధృచ్చికం కాదు. గృహిణిగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే, అయిదు బ్లాగులు రాస్తూ, ఇ తెలుగుకు సంబంధించి ఎన్నో గ్రూపుల్లో క్రియాశీలక పాత్రపోషిస్తూ,ఎందరినో ప్రోత్శహిస్తూ,తెలుగులో ఎలా రాయాలో నేర్పిస్తూ,ఇలా అస్టావధానం చేస్తున్న ఆమెను చూసి ఎందరో ఉత్తేజితులవుతున్నారంటే ఆశ్చర్యమేమీ లేదు.తనువెలు గుతూ,వేలాదిమం దికి,వెలుగులు అందిస్తుందని భావించారేమో ఆమెకు జ్యోతి అని నామకరణం చేశారు.
తాజాకలం:-తెలుగులో ఎలారాయాలో ఏ సాఫ్ట్ వేర్లు ఉపయోగించాలో తెలిసిన వారు రచన పత్రికకు తమతమ సూచనలు,సలహాలను పంపమని వారు డి సెంబరు సంచికలో కోరారు.కానీ అవి ఒక వ్యాసం గా కాక ఉత్తరాల రూపం లో ఉందాలని వారు స్పష్టం చేశారు.ఆసక్తి గలవారు ఈ ఇమెయిల్ కు రాయండి rachanapatrika@hotmail.com,rachanapatrika@gmail.com