Friday, January 18, 2008

ఒక జ్యోతి, వేల వెలుగులు


వాశి తో పాటు రాశి కూడా చాలా అవసరమైన సంధి దశలో తెలుగు బ్లాగులున్నాయి ఈ రోజు. తెలుగులో రాయలేకపోవటం అంటే టైపింగు, కంప్యూటరు, ఇంటర్నెట్ అందుబాటులో లేక పోవడమూ అనేవి పలురకాల కారణాలతో ముడిబడి ఉన్న అంశాలు. కొన్ని వ్యక్తిగత స్థాయిలోనివి కాగా మరికొన్ని ప్రభుత్వం చేయాల్సినవి. కానీ పైన పేర్కొన్న అంశాలేవీ మనలోని ఉత్సాహాన్ని, ఉరకలూ, పరుగుల మీద ముందుకురికే ఆలోచనలనూ, అభిప్రాయాలనూ అడ్డుకోలేవు. కేవలం రాసుకుంటూ పోయే దశ నుంచి ఈ నాటి తెలుగు బ్లాగర్లు స్వచ్చందంగా సాంకేతిక సహాయం అదీ తక్షణ సాయం సుదూరతీరాల్లో ఉన్న వారికి కూడా అందించి మాట లకందని సేవ చేస్తున్నారు. వేలు పెట్టి తెలుగు సాఫ్ట్ వేర్ కొని, కీబోర్డ్ లు మార్చుకుని, సగం వచ్చి సగం రాక ఇబ్బందులు ఎదుర్కొని మధ్యలో వదిలేసిన వారు, మళ్ళీ సులభంగా సజావుగా తెలుగు టైపింగు చేయగలుతున్నారూ అంటే మన బ్లాగర్ల సాయంతోనే. బ్లాగులు అంటే ఏమిటీ, తెలుగులో బ్లాగులు ఎలారాయాలీ అనే ప్రాధమిక అంశాలనుంచి టీంవ్యూయర్ అనే సాధనంతో ఎక్కడో ఉన్నవారి కంప్యూటర్ లోకి ప్రవేశించి విసుగువిరామంలేకుండా శ్రమించి సమస్యను పరిష్కరించేందుకు రాత్రి రెండు గంటలవరకూ కృషి చేస్తున్న వారిని, నిస్వార్ధంగా వారు అందిస్తున్న సహాయానికి ఎలా మూల్యంచెల్లించగలంఅని ఆలోచిస్తే , అసలు కృతజ్ఞత అనే మాటే ఎత్తొద్దనే నల్లమోతు శ్రీధర్, శ్రీనివాస కర, ప్రసాద్, ప్రవీణ్, ఇలా ఎందరో శ్రామికులు. వీరందరికీ సంధానకర్త జ్యోతి. జ్యోతి ప్రోత్శాహంతో బ్లాగర్లుగా మారి ఏకకాలం లో అటుబ్లాగులకు, ఇటు భాషకు, మరో వైపు సమాజసేవా కార్యక్రమాల్లో, సాంకేతిక తక్షణసహాయం లో చురుకుగా పనిచేస్తున్న వారిని చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. తాజాగా జాగృతి పేరుతో వస్తున్న బ్లాగు కూడా కంప్యూటర్ ఎరా పాఠకుడిదే కావటం యాధృచ్చికం కాదు. గృహిణిగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే, అయిదు బ్లాగులు రాస్తూ, ఇ తెలుగుకు సంబంధించి ఎన్నో గ్రూపుల్లో క్రియాశీలక పాత్రపోషిస్తూ,ఎందరినో ప్రోత్శహిస్తూ,తెలుగులో ఎలా రాయాలో నేర్పిస్తూ,ఇలా అస్టావధానం చేస్తున్న ఆమెను చూసి ఎందరో ఉత్తేజితులవుతున్నారంటే ఆశ్చర్యమేమీ లేదు.తనువెలు గుతూ,వేలాదిమం దికి,వెలుగులు అందిస్తుందని భావించారేమో ఆమెకు జ్యోతి అని నామకరణం చేశారు.
తాజాకలం:-తెలుగులో ఎలారాయాలో ఏ సాఫ్ట్ వేర్లు ఉపయోగించాలో తెలిసిన వారు రచన పత్రికకు తమతమ సూచనలు,సలహాలను పంపమని వారు డి సెంబరు సంచికలో కోరారు.కానీ అవి ఒక వ్యాసం గా కాక ఉత్తరాల రూపం లో ఉందాలని వారు స్పష్టం చేశారు.ఆసక్తి గలవారు ఈ ఇమెయిల్ కు రాయండి rachanapatrika@hotmail.com,rachanapatrika@gmail.com

Sunday, January 6, 2008

ఎవరు బ్లాగులు రాయాలి, ఎవరు మానాలి


నాబ్లాగుకు నేను ఆశించిన స్థాయిలో కాక పోయినా కనీస స్పందన రావట్లేదు. బ్లాగులోని టపాలను చదువుతున్నారని తెలుస్తున్నా వారి వ్యాఖ్యానాలు లేక కామెంట్లు వచ్చినప్పుడే కదా మనకు వారి అభిప్రాయాలు తెలిసేది?


చదవాలి అనిపించిన బ్లాగులు చదువుతాము, స్పందన ఆటపాను చదవగానే కలగాలి అంతే గానీ, తెచ్చిపెట్టుకునే వ్యాఖ్యలు ఎందుకు రాయాలి?


పైన రెండు వాక్యాలు ఒకరితో ఇంకొకరు చేసుకున్న సంవాదం లా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ దురదృష్టవశాత్తూ కొందరు కొన్ని సార్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు అవి. మనం అద్భుతంగా రాస్తాం, ఎంతో సహజంఅది, పాఠకులు వెంటనే స్పందించి కామెంట్లు రాయాలి కానీ రాయట్లేదు.


అలాగే మనంఏ కూడలికో, జల్లెడకో వెళ్ళి బ్లాగులు చూస్తాము, కామెంట్లు రాద్దామనే ఉదారమైన సదుద్దేశం కూడా ఉంది మనకు కానీ ఏబ్బే ఏది చూసినా హృదయం స్పందించటంలేదు, తెచ్చి పెట్టుకున్న వ్యాఖ్యలు రాస్తే ఏంబావుంటుంది?


అసలు ఎందుకు రాస్తాము ? ఇదో మౌలికమైన ప్రశ్న దానికి తేలిక సమాధానం బ్లాగు మనది కాబట్టి, అందరూ చూడాలనేగా అవును, చూస్తున్నారా? అవును, మరి ఇంకేమిటి కొరత ఇక్కడకు వచ్చేసరికి సమాధానాల కొరత ఎదురవుతోంది.


అయ్యలారా, అమ్మలారా నేను ఎంతో కష్టపడి ఒక బ్లాగు నడుపుతున్నాను, మంచి సమాచారం తో తరచూ కొన్ని అంశాల మీద రాస్తున్నాను, మీరు చదివి మీ అభిప్రాయాలు తెలియజేస్తే సంతోషిస్తాను అని చెప్పుకోవటానికీ, నేను బాగా రాస్తాను, కానీ మీరే ఏమీ స్పందించట్లేదు , నేను ఎందుకు కామెంట్లు రాయట్లేదు అంటే మంచి వ్యాసాలు చూసి తక్షణం మనకు కామెంటు రాయాలి అనిపించాలి, నేను మీ రచనలు చూసి అలా ఫీల్ కాలేకపోతున్నాను కాబట్టి రాయట్లేదు గానీ, వేరే ఉద్దెశం ఏమీ లేదు అంటే ఎలా ఉంటుందో కనీసం అ ఆ లు చదవగలిగిన వాళ్ళు అందరూ అర్ధం చేసుకోగలరు.


సమకాలీన సమాచార, ప్రసార సాధనాలు అన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న ఇంటర్నెట్ అనే మహావ్యవస్తలో అన్నిటికంటే, రెండంచుల కత్తి లాగా టూ వే కమ్యూనికేషన్‌ కు, పైగా తక్షణం అవతలి వారి మనోభావాలను తెలుసుకునే వీలున్న బ్లాగుల రచనను వేళాకోళంగా చూసే వారిని చూసి మనం జాలీ, సానుభూతి చూపటం తప్ప ఇంకేమన్నా చేయగలమా? నేను ఊక తెస్తాను, నువ్వు పప్పులు పట్టుకురా రెండూ కలిపి ఊదుకుని తిందామన్నారట ఎవరో వెనకటికి.


నా కామెంటు ఎంతో అమూల్యం, అంత సులభంగా అన్నిటికీ రాయను అని నేను అనుకుంటున్నట్లే, అందరూ అదే విధంగా భావిస్తారు అనే ఆలోచన నాకు వచ్చినప్పుడు ఇంకొకరిని కించపరిచే విధంగా ఎవరూ రాయరు. బ్లాగుల సంఖ్య పెరగటంవల్ల కామెంట్లు రాయలేక పోతున్నాము అనే వాదన కూడా అసమగ్రముగా ఉంది. 1997 లో మొదట ప్రాచుర్యం లోకి వచ్చిన నాటి నుంచి నేటి దాకా బ్లాగుల సంఖ్య వందల, వేలరెట్లు పెరిగింది, పెరుగుతూనే ఉంటుంది. సమాచార విస్ఫోటనం ఒకరు ఆపితే ఆగేది కాదు, ఆపలేరు కూడా. పోనీ ఎన్ని బ్లాగులుంటే బాగుంటుంది? అప్పుడైనా అన్ని బ్లాగులకూ కామెంట్లు వస్తాయా అనేది ఎవరైనా చెప్పగలరా? అలాగే ఎవరు బ్లాగులు రాయాలి, ఎవరు మానాలి అనే అంశం ఎవరు నిర్ణయిసారు. ఆనిర్ణయాన్ని ఎవరు శిరసావహిస్తారు? బ్లాగుల మీద ఒక నియంత్రణామండలి--కంట్రోలింగ్ బోర్డ్ ఉండాలని కోరుకుంటున్నారా?


రెండు మూడేళ్ళ క్రితంవరకూ అనామకంగా ఉన్న తెలుగుబ్లాగులు ఈరోజు ఎంత ప్రాముఖ్యం వహిస్తున్నాయో గ్రహించ లేని వారు ఆవిధంగా మాట్లాడితే మనం కొంత మేరకు అర్ధంచేసుకోవచ్చు. కానీ అన్నీ తెలిసినవారే వక్రభాష్యాలు చెప్తుంటే జీర్ణించుకోవటం కష్తమే కదా?!

ఒకవైపు ఎందరో సాంకేతిక నిపుణులు, ఔత్శాహికులు-వీవెన్‌, నల్లమోతు శ్రీధర్, శ్రీనివాస, శ్రీకర, రవివైజాసత్య, ఒరెమునా, చదువరి, ఇంకెందరో నిస్వార్ధంగా ఎంతో విలువైన తమ సమయాన్ని వెచ్చిస్తూ, బహుముఖ ప్రజ్ఞాశాలులైన కొత్తపాళీ, సత్య సాయి కొవ్వలి, రామనాధరెడ్డి వెంకట్, సౌమ్య, రాధిక, నిషిగంధ, తాడేపల్లి, నువ్వు శెట్టి బ్రదర్స్, ఇలా ఎందరో తమతమ రచనలతో, రాకేశ్వర, పరుచూరి శ్రీనివాస్ లాంటి వారు తమ విలువైన వ్యాఖ్యానాలతో, అందరినీ సమన్వయం చేస్తూ దీప్తిధార రావుగారు,జ్యోతి గారు ఇలా ఎందరో రైలు పట్టాల లాగా ఎంతో బాధ్యతగా సంతోషంగా తెలుగు బ్లాగుల బండిని ముందుకు నడిపిస్తున్నారు.


తెలుగువాడిని,గారపాటి ప్రవీణ్ లాంటి వారు బ్లాగుల కు మరికొన్ని హంగులు,ఆదాయం కామెంట్లు పెరగటం ఇలాంటి విషయాల మీద ఎన్నొ ఆలోచనలతో ముందుకు వస్తున్నారు.ఎవరి ఆత్మానందం కోసం వారు రాసుకోవచ్చు,తప్పులేదు,కానీ ఎవరో అసంతృప్తి ని దృష్టిలో ఉంచుకోని బ్లాగులు ఆగవు.ఇది నిజం,బ్లాగులదే భవిష్యత్.