Monday, December 17, 2007

బ్లాగుల బాగోగులు


తెలుగు బ్లాగర్ల సంఖ్య తో పాటు వాసి కూడా పెరుగుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. అమెరికా బ్లాగర్లతో పోలిస్తే మన దేశంలో ముఖ్యంగా తెలుగులో బ్లాగురచన అనేది కొంచెం వెనుక ప్రారంభమయినా ఈరోజు గణనీయమైన సంఖ్యలో తెలుగు బ్లాగులు వెలువడుతున్నాయి.కూడలి,జల్లెడ,తేనెగూడు,తెలుగుబ్లాగర్స్ డాట్ కాం వంటివారి సేవ ఎంత చెప్పినా ఈవిషయంలో తీర్చుకోలేనిది.బ్రిటానికా, ఎన్ కార్టా వంటి వాటికి ధీటుగా ప్రత్యామ్నయ విజ్ఞాన సర్వసం గా దినదినాభివృద్ధి చెందుతున్న వికిపీడియా లో తెలుగు వారి వంతు ప్రశంసనీయంగా పెరిగిందంటే బ్లాగరుల సహాయ సహకారాలే ప్రధాన కారణం.



గతంలో ఏకొద్దిమందికో పరిమితమైపోయిన బ్లాగులు క్రమక్రమగా జనాభాలో ఎక్కువ మందికి అందుబాటులోకి రావటానికి సాంకేతిక కారణాలతోపాటు సాంస్కృతిక అంశాలూ దోహదం చేస్తున్నాయి.ఎందరో ప్రతిభావంతమైన రచనలను తమ బ్లాగుల ద్వారా మనకు అందిస్తున్నారు.ఎంతో మంది మట్టిలో మాణిక్యాల లాంటి సృజన శీ లులు బ్లాగులలోకంలో తమపాదముద్రలను ప్రతిష్ఠిస్తున్నారు. అదీఇదీ అని పరిమితులు లేకుండా దాదాపుగా సమకాలీన సమాజంలోని అన్ని విషయాలమీద తమ అభిప్రాయాలను స్పష్టంగా,తమదైన శైలిలో వ్యక్తీకరిస్తున్నారు.



పాఠకులు ఇచ్చే సూచనల మేరకు ఎప్పటికప్పుడు తమ భాష,రచనా సంవిధానంలో మార్పులు చేసుకుంటూ మరిన్ని మెరుగులు దిద్దుతున్నారు.కళలు,సాహిత్యం,సినిమా.హాస్యం,కవిత్వం,సాహితీ విమర్శ, రాజకీయాలు,సాంకేతిక రంగం ఇలా ప్రతి అంశాలోనూ నిష్ణాతులైన రచయితలు బ్లాగర్లలో ఉన్నారు. అయితే ఇక్కద కొన్ని కీలకాంశాలను కూడా ప్రస్తావించుకోవాలి.లబ్ధ ప్రతిష్తులైన ఎందరో ఏ కారణాల చేతనో తెలియదు కాని బ్లాగుల రచనలకు దూరంగా ఉంటున్నారు.కొందరికి తమ రచన మీద బ్లాగుల్లో ఎంతో రసవత్తరమైన చర్చ జరిగిన విషయం కూడా తెలియట్లేదు .అది వారి తప్పు అని మనం అనలేము.వారిని క్రమక్రంగా బ్లాగురచనలకు ప్రోత్సాహించాలి.ఒక మిత్రుడు అన్నట్లు ఆర్ధిక కారాణాలు కూడా ఇందులో అంతర్భాగం కావచ్చేమో కానీ అదే అసలు కీలకం అని నేను భావించటం లేదు.సందర్భం వచ్చింది కాబట్టి,బ్లాగు రచనల ద్వారా ఏమయినా రాబడి ఉంటుందేమో కనీసం భవిష్యత్తులో యాడ్ సెన్స్ కాకుండా పెద్దలు ఆలోచించాలి.ఈ యాడ్ సెన్స్ మతలబు ఏమిటో ఇంతవరకూ నాకు అంతుబట్టలేదు,బహుశా నాలాంటి వారు ఇంకెందురున్నారో.



బ్లాగర్లలో ఎక్కువ మందిని కలవరపెడుతున్న అంశం మరింత పాఠకాదరణ పొందటం.దాదాపు అన్ని బ్లాగులకూ పాఠకులున్నారు,ఉంటారు కూడా. కానీ బ్లాగరు తాను ఎంతో శ్రమకోర్చి రాసినప్పుడు పఠితల స్పందనను ఆశించటంలో తప్పు లేదు.కానీ ఇక్కడ అదే కొరవడుతోంది చాలా మంది విషయంలో. అన్ని బ్లాగులూ చదివి అందర్నీ వ్యాఖ్యానాలు చేయమని అనలేము గాని,నచ్చితే ఒకముక్క,నచ్చక పోతే రెండు ముక్కలు రాసేందుకు అవకాశముంది.కామెంట్లు రాయటంవల్ల ఒక రచన మీద మన అంచనా రచయితకు తెలియ జేయొచ్చు అలాగే మనలోని చోటా సాహితీ విమర్శకుడికి ఒక దారీ చూయించొచ్చు.
బ్లాగును ఎక్కువ మంది పాఠకుల వద్దకు తీసుకు వెళ్ళటం అనేది మరో అంశం. ఎవరికి వారు బ్లాగు రాసుకున్నా ఒక యాగ్రిగేటరు సాయం లేనిదే ఆ బ్లాగ్ వెలుగు చూసే అవకాశాలు తక్కువ కాబట్టి ముందా యాగ్రిగేటరును ప్రజబాహుళ్యంలో ప్రచారం చేయాలి.తద్వారా స్వామికార్యం స్వకార్యం రెండూ నెరవేరే అవకాశం ఉంది.



అదే విధంగా వీలయినన్ని డైరెక్టరీలలో మన బ్లాగును సబ్మిట్ చేయటంవల్ల కూడా కొంతమేరకు ఫలితాలు ఆశాజనకంగా ఉండొచ్చు.దాని వల్ల తెలుగు బ్లాగులుతో పాటు మనమూ విదేశీజనాల కళ్ళల్లొ పడే అవకాశం ఉంది. నేను తెలుగులో బ్లాగు ప్రారంభించిన కొత్తలో టెక్నొరటిలో నార్యాంకు నలభై నాలుగు లక్షల చిల్లర కొద్ది రోజుల తర్వాత ఇరవై లక్షల చిల్లర అంటే సుమారు 30లక్షలకు దగ్గరలో స్థిరంగా ఉండి పోయింది.అదేవిధంగా సులేఖా లో కూడా ప్రయత్నించొచ్చు.

ఇంకా ఉంది....

7 comments:

ప్రదీపు said...

మీరిప్పటికే చూడకపోతే adsense గురించి ఇక్కడ చదివి తెలుసుకోండి. మీ బ్లాగుకు పాటకులను బాగా ఆకర్షించుకో గలరని అనుకుంటే వెంటనే మీ బ్లాగుకు జతచేసేయండి.

నేను కూడా మొదట్లో ఒక రెండు సంవత్సరాల పాటు నా బ్లాగులో adsense వాడి ప్రకటణలు వచ్చేటట్లు పెట్టాను. ఒక సంవత్సరం అయిన తరువాత చూసుకుంటే ఒక డాలరు ఉంది ఎక్కౌంట్లో! కనీసం 100 డాలర్లు పోగయితేగానీ మన డబ్బు మనకు పంపించడంట! రెండో సంవత్సరం చివరకు ఇంకో అర డాలరు పోగయ్యింది, అప్పుడింకా చిరాకేసి దానిని నా బ్లాగు నుండి తీసేసాను.

అసలు మన తెలుగు బ్లాగ్ ఆగ్రిగేటర్లలో ఇలాంటి adsense ప్రకటణలను ఎందుకు పెట్టటంలేదో నాకు ఇంకా అర్ధం కావటం లేదు... వారి సర్వర్ల నిర్వహణా వగైరాలకు చాలా ఖర్చవుతుంది, ఆ ఖర్చునంతా వారి వారి సొంత జేబుల నుండే పెట్టుకుంటున్నారు!.

Rajendra Devarapalli said...

@అయ్యా ప్రదీపు గారు,ఆడ్ సెన్స్ గురించి ఇంతబాగా ఇన్నేళ్ళూ నాకు ఎవరూ చెప్పలేదు.పొరపాటున కూడా వాడిని కాలు కాదు కదా వేలిగోరు కూడా పెట్టనివ్వను.

కొత్త పాళీ said...

ఔత్సాహికుల ప్రయత్నాల వలన ముందు విత్తనం నాటటం, కొద్దిగా నీరు పోయటం వరకూ జరుగుతుంది. తెలుగు బ్లాగుల పరిస్థితి ప్రస్తుతం ఈ దశలో ఉంది. రచనలో చెయ్యి తిరిగిన సమర్ధులైనా, ఇంతవరకూ రచన చెయ్యని కుర్రకారైనా ఈ బ్లాగు ప్రక్రియలోని ఏదో ఆకర్షణవల్ల తమ ఉత్సాహంతో బ్లాగులు రాస్తున్నారు. ఇంతకు మించిన ప్రయోజనం ఏదన్నా దీనివల్ల సిద్ధించే అవకాశం కనబడితే గానీ తెలుగు బ్లాగులు విరివిగా వృద్ధికావు, ఆంగ్లంలోనూ మరి కొన్ని భాషలలోనూ ఐనట్టు. ఆ ప్రయోజనం పూర్తిగా వ్యక్తిగతం కావచ్చు, సామాజికం కావచ్చు. ఉదాహరణకి యాడ్‌సెన్సు వంటి వాటిద్వారా వ్యక్తిగత ఆదాయం .. కేవలం సినిమాకి సంబంధించిన సమాచారం (అదేమీ వాళ్ళ స్వంతం కాదు, అక్కడా ఇక్కడా దొరికిన బొమ్మల్నీ, విడియో క్లిప్పుల్నీ కూడగట్టి పెట్టినవి)తో తెలుగు "బ్లాగులు" పుంఖానుపుంఖాలుగా ఉన్నాయి .. ఎవరికి ప్రయోజనం వాటి వలన? లేకపోతే ఏదో ఒక వ్యాపకమో ఆసక్తి విషయమో బ్లాగర్లని దగ్గర చెయ్యాలి .. కంప్యూటరు చర్చలు, సాహిత్య చర్చలు, వివిధ కళలు, సినిమాల చర్చలు, ఇలా. లేదా ఒక సామాజిక చైతన్యం కోసం ఉద్యమించే అవగాహన, అవకాశం ఉన్నవాళ్ళందర్నీ ఒకచోట చేర్చవచ్చు. ఇప్పటికే ఇలాంటి పనులన్నీ అంతర్జాలంలోని వివిధ ప్రక్రియలు (పోర్టళ్ళు, ఈమెయిలి గ్రూపులు, చర్చావేదికలు, ఇత్యాది) చేస్తున్నాయి. అంచేత బ్లాగులు వీటికి కొత్తగా చేసేదేమిటని ఆలోచించాలి. గత ఎన్నికల నించీ అమెరికా రాజకీయాల్లో బ్లాగర్లది ఒక క్రియాశీలక పాత్ర అయిందని బహుశా మన బ్లాగర్లందరికీ తెలుసు. వచ్చే ఎసెంబ్లీ ఎన్నికల సమయానికైనా తెలుగు బ్లాగర్ల సంఘటిత శక్తి ఆంధ్ర రాజకీయ రంగంలో కూడా అటువంటి స్థితి సంపాదించాలని నా కోరిక.

cbrao said...

తెలుగు బ్లాగులకు గూగుల్ వారు adsense పెట్టడానికి ఇంకా సమాయత్తంగా లేరు. బ్లాగుల మీద ఆదాయం కావాలంటే , ఆంగ్ల బ్లాగులు రాయాల్సిందే.అప్పుడే గూగుల్ వారు మన బ్లాగును గుర్తిస్తారు. తెలుగు బ్లాగులు, మన స్వీయ ఆనందం, ఆత్మతృప్తి కోసం మాత్రమే రాయవలసి ఉంటుందని గమనించాలి.

ప్రఖ్యాత రచయితలు బ్లాగులకు దూరంగా ఉండటానికి ప్రధమ కారణం - వారికి ఇంటర్నెట్ తో పరిచయం తక్కువ వుండటమే. ఇంకో కారణం తెలుగు type చెయ్యలేక పోవటం. మీరు type చేస్తానంటే మీ విశాఖ లోనే కొందరు రచయితలు వారి రచనలు, మీకు ఇవ్వగలరు.విశాఖ రచయితలతో మీకు ఎక్కువ పరిచయం కావాలంటే,"rahamthulla" nrahamthulla@yahoo.com గారిని సంప్రదించండి.

మీ బ్లాగుకు పాఠకులు, వ్యాఖ్యలు, అభిమానులు పెరగాలంటే, మొదటగా మీరు తీరిక వేళలలో, ఇతరుల బ్లాగులు చదివి, మీ అభిప్రాయం, కామెంట్ల రూపం లో తెలియ చెయ్యండి.మీ కామెంట్ చూశాక, మీ బ్లాగు ఏమిటో చూద్దామన్న కుతూహలంతో, అవతలి బ్లాగరు, మీ బ్లాగు చూడటానికి వచ్చి, తనకు నచ్చిన టపా పై వ్యాఖ్య రాస్తాడు. ఆ వ్యాఖ్యను, కూడలి లో చూసి, మరి కొంతమంది పాఠకులు, ఇంతకీ ఆ వ్యాసం ఎలా వుంది అన్న కుతూహలం తో మీ బ్లాగు సందర్శిస్తారు. ఇలా ఇతరుల బ్లాగుల పై కామెంట్లు రాయడం, ఉభయత్రా, లాభదాయకమే.

వీవెన్ said...

తెలుగు బ్లాగులు ఆర్థికంగా లాభదాయకంకావడానికి, ఇంకా సమయం పడుతుంది. ఆదాయాన్ని ఆశిస్తున్నవారు వివిధ వెబ్ సైట్లతోనూ మరియు ముద్రిత పత్రికలతోనూ అంగీకారాలు కుదుర్చుకోవచ్చు. సమీప భవిష్యత్తులో ఇదే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది. గూగుల్ Adsense ఇంకా తెలుగుకి సిద్ధంకాలేదు. తెలుగులోని కీలకపదాలకు సంబంధిత ప్రకటనలు చూపించలేక పోతుంది. ఇది మెరుగవ్వడానికి మరో ఏడాదో లేక రెండేళ్ళో పట్టవచ్చేమో.

టపాలపై తగినన్ని వ్యాఖ్యలు ఆశించాలంటే, తెలుగు బ్లాగులు ఇంకా చాలా మందికి తెలియాలి. ప్రస్తుతం తెలుగు బ్లాగులకు 'చదువరులకు వ్యాఖ్యల నిష్పత్తి' ఆంగ్ల బ్లాగుల కంటే ఎక్కువేననిపిస్తుంది. 'టపాలు వ్యాఖ్యల నిష్పత్తి' పెరగాలంటే, మరింత మంది చదువరులు రావాల్సిందే. కొత్తపాళీ చెప్పినట్టు, ప్రత్యేక వ్యాపకాలు లేదా ఆసక్తులు సంబంధిత వ్యక్తులని దగ్గరకు తీసుకువస్తాయి. అంతేకాదు అప్పుడు నాణ్యమైన వ్యాఖ్యలు కూడా చేరతాయి. ఉదాహరణకి పద్యాల బ్లాగులు. అక్కడ ఉన్నది తక్కువ బ్లాగరులైనా, ప్రతీ టపాపై దాదాపుగా అందరూ వ్యాఖ్యానిస్తారు.

@ప్రదీపు
కూడలిలో adsense ఉపయోగిస్తున్నా. కానీ ఇంగ్లీషు విభాగంలోనే ప్రకటనలు కనిపిస్తున్నాయి.

Unknown said...

పైన చెప్పినవన్నీ నిజాలు...
ఇక్కడో విషయమేమిటంటే వ్యాఖ్యల గురించి, ఇంగ్లీషు బ్లాగుల్లో చాలా మటుకు ఎవరూ పట్టించుకోరు. కొన్ని పేరొందినవి తప్పితే.
వ్యాఖ్యలు రాసేవారూ తక్కువే.

తెలుగు బ్లాగులు ఇంకా నయం. వ్యాఖ్యల నిష్పత్తి బాగానే ఉందని నా అభిప్రాయం. ఇప్పటికే డీలా పడిపోతే రేప్పొద్దున్న జనాలు పెరిగి వ్యాఖ్యలు తగ్గితే (ఇప్పటికే ఈ ట్రెండు మొదలయింది) తట్టుకోవడం కష్టం.

కాబట్టి నాకు సంబంధించిన వరకూ మీ బ్లాగు ఎవర్గ్రీను గా ఉంచాలనుకుంటే మీకు సంబంధించి ఒక ప్రత్యేకమయిన స్కిల్ సెట్ ని ఎంచుకుని దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చెయ్యడమే.

ఇక ఆర్థిక పరమయిన సంగతుల గురించి మర్చిపోండి. ఇంతవరకూ ఏ ఆన్లయిను ఆడ్ కంపెనీ కూడా భారత భాషలకి లోకలైజ్ కాలేదు. మీకు కావాలంటే రాండమ్ గా ఆడ్లు ఇచ్చే కంపెనీలు ఉన్నాయి కానీ అవి మీ పాఠకులకి చిరాకు తెప్పిస్తాయి.

@వీవెన్:
ఆడ్ బ్లాక్ ప్లస్ మొదలయిన ఆడాన్లు వాడుతున్నందువల్ల ప్రదీపు కీ, నాకూ, చాలా మందికి అసలు కూడలి లో ఆడ్సెన్స్ వినియోగిస్తున్న సంగతే తెలీదనుకుంట.

రవి వైజాసత్య said...

అన్నింటికీ కీలకం కంప్యూటర్లో తెలుగు చదవచ్చు, వ్రాయచ్చు చాలా సులభం అని తెలిసివారి సంఖ్య పెంచటమే..if we try to do too much with too little. జనాలు బర్నవుట్ అయ్యే అవకాశం మెండు.
ప్రస్తుతమున్న పరిమిత వ్యాఖ్యలు వ్రాసేవాళ్ళూ, టపాలు వ్రాసేవాళ్ళనూ మరింత లాగలేం.
subscriber base పెంచుకోకుండా మనలో మనం ఎంత గింజుకున్నా లాభం లేదు. ఇదివరలోలా మళ్ళీ పునరంకితమై ప్రచారోద్యమం చేపట్టాలి. అలా చేపట్టకపోతే కాలక్రమంలో తెలియదని కాదు..మనం ప్రక్రియకు ఉత్ప్రేరకంగా పనిచేసి శీఘ్రతరం చెయ్యాలి.
సో..అమ్మలు..అయ్యాలూ back to the basics.. మీ కంప్యూటరు తెలుగు నేర్పిండమెంత సులువో తెలుసా??